ఇన్‌స్టాలో యువతుల మధ్య పరిచయం.. ఆపై పెళ్లి, కాపురం.. ఇప్పుడు విషాదాంతం


ఆ యువతుల మధ్య పరిచయానికి ఇన్‌స్టాగ్రామ్ వేదిక అయింది. ఆ స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. అది మరింత ముదిరి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఆపై హైదరాబాద్‌ చేరుకుని రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వారిని విడదీశారు. తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మరో యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలానికి చెందిన ఓ యువతి (21)కి అదే జిల్లా గార్ల మండలానికి చెందిన యువతి (20)తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం అయింది. ఆపై అది ప్రేమగా మారడంతో మూడు నెలల క్రితం హైదరాబాద్ చేరుకుని పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. విషయం తెలిసిన వారి తల్లిదండ్రులు వెతికి పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. మే నెల చివరి వారంలో ఇద్దరూ కలిసి మళ్లీ విజయవాడ పారిపోయారు. 
కురవి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి యువతులను వారిళ్లలో అప్పగించారు. ఎడబాటును భరించలేకపోయిన యువతులు ఈ నెల 1న మహబూబాబాద్‌లో రహస్యంగా కలుసుకున్నారు. కలిసి జీవించలేకపోయినా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఎలుకల మందుతాగి ఆత్యహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కురవి యువతి నిన్న చనిపోయింది. మరో యువతి ప్రాణాలతో పోరాడుతోంది.